మల్కాజిగిరి నియోజకవర్గం మంత్రి మల్లారెడ్డికి, తనకు రెండు కళ్లలాంటివని, కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. మల్లారెడ్డితో కలిసి జోడెద్దులా ఈ నియోజక వర్గాన్ని రక్షించుకుంటామని చెప్పుకొచ్చారు. గురువారం మల్కాజిగిరిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలు ఓ మంచి వ్యక్తికి, గుండాగిరికి మధ్య జరుగుతున్నవని, తెలంగాణ రాష్ట్రంలో బెదిరింపులకు, గుండాగిరికి తావులేదని అన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే గెలుస్తుందని.. ప్రజలు మంచివైపే నిలుస్తారని చెప్పారు.
మైనంపల్లి హనుమంత రావు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారో అందరికీ తెలిసిందే. తన ముద్దుల కొడుక్కు పార్టీ టికెట్ ఇవ్వనంటే రాజీనామా చేసి వెళ్లిపోయాడని విమర్శించారు. మెదక్, మల్కాజిగిరి స్థానాల్లో తండ్రీ కొడుకుల ఓటమి తప్పదని ధీమా వ్యాక్తం చేశారు. రౌడీల రాజ్యానికి స్వస్థిచెప్పి, ప్రశాంతమైన మల్కాజిగిరిని ఏర్పాటుచేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. మంచి వ్యక్తి, విద్యావంతుడైన మర్రి రాజశేఖర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.