ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో పాటతో ఆయన నింపిన స్పూర్తి గొప్పదన్నారు. పాటతో ప్రజల్లో నింపిన చైతన్యాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్ మరణంపై ట్విట్టర్ ద్వారా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ‘ప్రజా యుధ్ధ నౌకగా పేరుగాంచిన కవి, రచయిత గద్దర్ గారి మృతి బాధాకరం. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా, తనదైన పాటలతో అందరినీ కదిలించిన ప్రజాగాయకుడు. 'అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా' అంటూ, 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా' అంటూ తెలంగాణ ఉద్యమంలో తన గళంతో కోట్ల మందిని ఉత్తేజపరిచిన ప్రజా గొంతుక గద్దర్ గారు. ఆయన మృతి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.’