Harish Rao: రిజెక్టెడ్ క్యాండిడెట్లతో కాంగ్రెస్ పార్టీ నిండిపోయింది: హరీష్ రావు
గులాబీ కోటకు కేరాఫ్ స్టేషన్ ఘన్పూర్ అని అన్నారు మంత్రి హరీష్ రావు. స్టేషన్ ఘన్పూర్ లో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీష్ రావు.. కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. 100 టికెట్లు, నూటొక్క ధర్నాలుగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహులు, అవినీతి పరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు పైకి చెప్పుకోలేనివి జరుగుతున్నాయని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లు రూ.50 కోట్లకు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవిని కొనుకున్నాడు.
భూమికి, డబ్బుకు టికెట్లు అమ్ముకున్న పార్టీ చేతికి రాష్ట్రం చిక్కితే ఉంటుందా? అని ఎద్దేవా చేశారు. రిజెక్టెడ్ క్యాండిడెట్లతో కాంగ్రెస్ పార్టీ నిండిపోయింది. ఆ పార్టీ సొంత నాయకులే పక్క పార్టీల దిక్కు చూస్తున్నారని అన్నారు. సొంతూళ్లల్లో గెలిచే దమ్ములేని నాయకులు వచ్చి కేసీఆర్ పై పోటీ చేస్తా అంటున్నారు. అధికారంలోకి వస్తే 9 గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. తీరా గద్దెరెక్కాక 3 గంటల కరెంట్ కూడా ఇవ్వలేదని హరీష్ రావు ఆరోపించారు. తండాలను గ్రామ పంచాయితీలు చేస్తామని చెప్పి గిరిజనులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. ఒక్కరికి ఆరుకిలోల బియ్యం ఇస్తామని చెప్పి చేతులెత్తేసిన పార్టీ కాంగ్రెస్. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అభిృద్ధి చెందారన్నారు. రైతులు, ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని హరీష్ రావు చెప్పుకొచ్చారు.