కేంద్రానికి ఆ ప్రాజెక్టులు అప్పగిస్తే.. తెలంగాణకు తీవ్ర నష్టం : హరీష్ రావు
తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల గురించి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయని.. ఇదే నిజమైతే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. గతంలోనూ ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించాలని డిమాండ్ వచ్చిందని.. కానీ తాము వ్యతిరేకించామని చెప్పారు. ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించాలంటే తాము కొన్ని షరతులను పెట్టామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఢిల్లీకి వెళ్లి ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోందని మండిపడ్డారు.
కేంద్రం చేతిలో ఉమ్మడి ప్రాజెక్టులు పెడితే తెలంగాణ అడుక్కోవాల్సి వస్తుందని హరీష్ రావు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్ట్లో హైడల్ పవర్ జనరేషన్పై తెలంగాణ హక్కును కోల్పోతామని హెచ్చరించారు. అటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపైనా ప్రభావం పడుతుందని అన్నారు. ఉమ్మడి ప్రాజెక్టుల బాధ్యతలను కేంద్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించొద్దని.. ప్రభుత్వం వెంటనే మేల్కొని రాష్ట్ర హక్కులను కాపాడాలని సూచించారు. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి రైతులకు సాగుకు అందించొచ్చన్నారు. అదేవిధంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లలో నీరు ఉందని.. పంటలకు నీటిని విడుదల చేయాలని కోరారు.