కాంగ్రెస్కు మేడిగడ్డ తప్ప ఇంకేం దొరకలేదు : Malla Reddy
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. 8రోజుల పాటు కొనసాగిన బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య వాడీవేడీ చర్చ సాగింది. అయితే అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి మేడిగడ్డ తప్ప వేరే అంశమే దొరకలేదన్నారు. ప్రతి రోజూ మేడిగడ్డనే అనడంతో ప్రజలు బేజారయ్యారని సెటైర్ వేశారు. ఇక అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీకి హరీష్ రావు చుక్కలు చూపించారని చెప్పారు. అసెంబ్లీ హరీష్ రావు వన్ మ్యాన్ హీరో అంటూ వ్యాఖ్యానించారు.
అంతకుముందు మాట్లాడిన హరీష్ రావు.. అసెంబ్లీలో అధికార పార్టీ బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పోరాటంతోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై రేవంత్ సర్కార్ యూటర్న్ తీసుకుందని చెప్పారు. ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో అన్నీ తప్పులే ఉన్నాయని ఆరోపించారు. తాను తప్పులను ఎత్తిచూపితే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని విమర్శించారు. తనను మాట్లాడనివ్వకుండా 8మంది మంత్రులు అడ్డుకున్నారని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్ మేడిగడ్డ ప్రాజెక్టును భూతద్దంలో పెట్టి చూపిస్తోందన్నారు. తమపై బురద జల్లాలనుకున్నా సరేగానీ.. ప్రాజెక్టును మాత్రం వానాకాలం లోపు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. ఆలస్యం చేస్తే రైతులకు బురదే మిగులుతుందని చెప్పారు.