సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు రైళ్లు నడపండి - మంత్రి హరీష్ రావు

Byline :  Kiran
Update: 2023-09-06 11:25 GMT

సిద్ధిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు రైళ్లు నడపడంతో పాటు హైదరాబాద్ నుంచి సిద్ధిపేటకు ప్యాసింజర్ రైలు నడపాలని మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ ను కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించేందుకు ఇరువురు నేతలు సికింద్రాబాద్ రైల్ నిలయంలో రైల్వే జీఎంను కలిశారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

కొత్తగా నిర్మించిన సిద్దిపేట రైల్వే లైన్కు ఈ నెల 15 న రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇన్‌స్పెక్షన్‌ పూర్తైన కాగానే ప్యాసింజర్ రైళ్లను, హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు పుష్‌పుల్‌ రైల్ ను ప్రారంభించాలని హరీష్ రావు కోరారు. పఠాన్ చెరు - ఎదులనాగులపల్లిలో గూడ్స్ టెర్మినల్‌, కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద కొత్త రైల్వే స్టేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మాసాయిపేట్ రైల్వే పెండింగ్ పనులు సైతం వేగంగా పూర్తి చేయాలని విత్రప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం వేగంగా భూ సేకరణ పూర్తి చేసి రైల్వే శాఖకు అప్పగించడం వల్లే సిద్దిపేట రైల్వే లైన్ పూర్తైందని హరీష్ రావు అన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా ఔటర్ రింగ్ రైల్వే లైన్ ను మెదక్ ,సిద్దిపేట వరకు పొడగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ తోనే సిద్దిపేట ప్రాజెక్ట్ ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. చేగుంట - మెదక్ రోడ్డులో కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు లభించినందున టెండర్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జీఎంను కోరారు. అన్ని విజ్ఞప్తిలపై సానుకూలంగా స్పందించిన జీఎం అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ మంత్రి, ఎంపీ చేసిన ప్రతిపాదనలను రైల్వే బోర్డ్‌కు పంపిస్తామని చెప్పారు.

Tags:    

Similar News