ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు అక్కర్లేదు : Harish Rao

Byline :  Krishna
Update: 2024-01-17 09:45 GMT

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు ఉండనక్కర్లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజలకు పనికొచ్చే అంశాలు లేకున్నా సోషల్ మీడియా దుష్ప్రచారాలతో ప్రభుత్వాలు మారుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ భవన్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని.. ఐదేళ్లలోపే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుని ఇంటికి పోతుందని ఆయన విమర్శించారు. కర్నాటకలో 5 గ్యారెంటీలు అమలుచేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందని కర్నాటక ఆర్థిక సలహాదారు హెచ్చరించినట్లు గుర్తు చేశారు.

ఇంకా 100 రోజులు కాలేదు కాబట్టి కాంగ్రెస్ గ్యారెంటీలపై మాట్లాడడం లేదని.. 100 రోజుల తర్వాత అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హరీష్ రావు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ రాష్టరాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. విభజన సమస్యలు ఇంకా అమలు కాలేదన్న ఆయన.. ఈ సమయంలో ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓ గుణపాఠంగా చేసుకుని.. ముందుకు సాగుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసిందని.. కానీ జాతీయ హోదా తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు కేంద్రం మెడలు వంచడాన్ని పక్కనబెడితే.. వారి మెడలో దండలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ - బీజేపీల మైత్రిని బండి సంజయ్ బహిరంగంగా ఒప్పుకున్నారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి గద్దెనెక్కిన చరిత్ర బీజేపీదని మండిపడ్డారు. కరీంనగర్ అభివృద్ధికి ఒక్క రూపాయి తీసుకరాని బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

Tags:    

Similar News