పంటలకు సరిపోను నీళ్లు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పంటలు ఎండిపోతుంటే.. రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో.. మీడియాతో మాట్లాడిన ఆయన గత పదేళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. ఇదే విషయాన్ని రైతులు చెప్తున్నారని వ్యాఖ్యానించారు. సాగు నీరు లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రాష్ట్రంలోని రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుందని చెప్పారు. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. సీఎంరేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయం పట్టడం లేదని ఆరోపించారు. రాజకీయ నేతల చేరికలపై తప్ప రైతుల గురించి ఆయనకు ఆలోచన లేదని మండిపడ్డారు. రైతులు కష్టాల్లో ఉంటే.. బ్యాంక్ ఉద్యోగులు అప్పుల గురించి వారికి నోటీసులిస్తున్నారని ఫైర్ అయ్యారు. అప్పులు చెల్లించాలని, బకాయిలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని రైతులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రజాకార్లను తలపించేలా కాంగ్రెస్ పాలన ఉందని ఎద్దేవా చేశారు.