Harish Rao : కాంగ్రెస్, బీజేపీల రహస్య స్నేహం మరోసారి బయటపడింది : హరీశ్ రావు

Byline :  Bharath
Update: 2024-01-26 05:41 GMT

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం పూర్తైంది. గురువారం (జనవరి 25) గవర్నర్ తమిళిసై రాష్ట్రప్రభుత్వం ప్రతిపాధనకు ఆమోదం తెలిపింది. ఈ నియామకంతో కాంగ్రెస్- బీజేపీ మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందన్నారు ఎమ్మెల్యే హరీశ్ రావు. కాంగ్రెస్ - బీజేపీల మధ్య ఉన్న రహస్య స్నేహం మరోసారి బయటపడిందని విమర్శించారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. రాజకీయ పార్టీల్లో ఉన్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను గవర్నర్ నిరాకరించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ పార్టీ అధ్యక్షుడినే (ప్రొ. కోదండరాం, తెలంగాణ జనసమితి పార్టీ) సిఫారసు చేస్తే గవర్నర్ ఎలా ఆమోదిస్తుందని మండిపడ్డారు.

ఇది ముమ్మాటికీ ద్వంద్వ నీతే.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని హరిశ్ రావు ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. క్రీడా , సాంస్కృతిక , విద్యా సామాజిక , సేవ రంగాల్లో కృషి చేసిన వారిని ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. కానీ వాటిని ఆమోదించని గవర్నర్ ఇప్పుడెలా కాంగ్రెస్ సిఫారసును ఒప్పుకుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై.. బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నాయన్నారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే విధంగా ఉండాలని, కానీ కాంగ్రెస్, బీజేపీలకు తేడా చూపిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు.




Tags:    

Similar News