బీఆర్ఎస్కు చెడ్డపేరు తెచ్చేందుకు రేవంత్ ప్రయత్నం : హరీష్ రావు
బీఆర్ఎస్పై బురద జల్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్కు చెడ్డపేరు తెచ్చేలా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తాము రిజర్వాయర్లు కట్టి నీళ్లు నింపడం వల్లే రైతులకు యాసంగికి నీళ్లు అందాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికీ నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. రేవంత్ సర్కార్కు చేతకాకపోతే రాజీనామా చేస్తే.. తాను సీఎం అయి రైతులకు న్యాయం చేస్తామన్నారు.
‘‘రేవంత్కు చేతకాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పజెప్పాలి. నాకు మద్ధతు ఇస్తా అంటే నేను సీఎం అవ్వడానికి రెడీగా ఉన్నా. సీఎం అయ్యాక చెప్పిన పని చేసి చూపిస్తాను’’ అని హరీష్ రావు అన్నారు. ఇప్పటికైన ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీరు అందించాలని కోరారు. రైతులకు నష్టం జరగొద్దనేదే తమ ఉద్దేశ్యమని హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 94 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే.. బీఆర్ఎస్ హయాంలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినట్లు తెలిపారు. ఇదంతా మేజిక్ చేస్తే జరగలేదని.. ఒక ప్రణాళిక ప్రకారం పాలిస్తే జరిగిందన్నారు.