కొండంత ఆశలు.. గోరంత అమలు అన్నట్లుగా బడ్జెట్ ఉంది - హరీశ్ రావు

By :  Kiran
Update: 2024-02-10 11:21 GMT

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను తీవ్ర నిరాశ పరిచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ అబద్దాలు చెప్పి, గోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని అర్థమైపోయిందని చెప్పారు. కొండంత ఆశలు.. గోరంత అమలు అన్నట్లుగా బడ్జెట్ ఉందని, అంకెలు మార్చి, ఆంక్షలు పెట్టి అన్నదాత నోరు కొట్టేలా ఉందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చేంతాడంత చెప్పి బడ్జెట్ లో మాత్రం చెంచాడంత ఇస్తున్నారని హరీశ్ విమర్శించారు. ఈ బడ్జెట్ తో ఆరు గ్యారెంటీల అమలు అటకెక్కిందని అర్థమవుతోందని సటైర్ వేశారు.

రైతుబంధుకు రాం రాం, రుణమాఫీ, పంటలకు బోనస్ అంతా బోగస్ అన్నట్టుగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని హరీశ్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ తో పంట బీమా, రుణమాఫీ, రైతు బంధు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బడ్జెట్లో రుణమాఫీ ప్రకటన లేకపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురి చేసిందన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ రైతులను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. ఆనాడు కాంగ్రెస్ కరెంటు ఇచ్చిందని మిలీనియం జోక్ చేశారని, అప్పట్లో కరెంటు కోతలతో రైతులు ఆత్మహత్యలు, విద్యుత్ షాక్, పాము కాట్లతో అన్నదాతలు చనిపోయిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతును రాజును చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లో రైతన్నను ఆగం చేసిందని హరీశ్ ఫైర్ అయ్యారు.

ఆరు గ్యారెంటీల అమలు మీద చట్టం చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా వందరోజుల ప్రస్తావన లేదంటే, వాటిని అమలు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసినట్లేనా అని సటైర్ వేశారు. నిరుద్యోగుల గురించి వారికి ఇస్తామన్న భృతి గురించి బడ్జెట్ లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News