రైతులు క్వింటాల్కు రూ.2వేలు నష్టపోతున్నారు : Harish Rao
రాష్ట్రవ్యాప్తంగా సన్‌ఫ్లవర్ పండించిన రైతులు మద్దతు ధర రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ అంశంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన లేఖ రాశారు. ఈ ఏడాది మద్దతు ధర రూ. 6760 ఉండగా మార్కెట్లో మాత్రం రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకే రైతులు అమ్ముకుంటున్నారని హరీష్ రావు మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రతి క్వింటాల్కు రూ.2వేలు నష్టపోతున్నారని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వం రైతుల నుంచి సన్‌ఫ్లవర్ను కొని రైతులను ఆదుకున్నట్లు హరీష్ రావు గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. మద్ధతు ధరకు పంటకు కొనాలని లేఖలో కోరారు.
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీలకు సరిగ్గా జీతాలు రావడం లేదని హరీష్ రావు ఆరోపించారు. అధికారంలోకి రాగానే ప్రతి నెల 1న జీతాలు చెల్లిస్తామని చెప్పిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు.
22 రోజులు గడుస్తున్నా అంగన్ వాడీలకు జీతం రాక అనేక తిప్పలు పడుతున్నారని.. నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, అంగన్ వాడీ టీచర్లు, అయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బంది జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.