రైల్వే స్టేషన్‌లోకి భారీగా నీరు.. భారీ వర్షాలతో వరంగల్‌ అతలాకుతలం

Update: 2023-07-27 08:02 GMT

తెలంగాణ చరిత్రలో మునుపెన్నడూ లేని అత్యంత భారీ వర్షం కురుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. భారీ వరదలకు పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు సైతం కాలువలను తలపిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. వరంగల్, ములుగు, కరీంనగర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. భారీగా హైద్రాబాద్- వరంగల్ మార్గంలోని చాగల్లు వద్ద హైవేపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో అధికారులు ట్రాఫిక్ ను మళ్ళించారు.

వరంగల్ వాసులు చిగురుటాకుల్లా వణుకుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. వరంగల్ నగరంలోని బట్టల బజార్, పాపయ్యపేట చమన్, పాత బీటు బజార్, సుశీల్ గార్డెన్ పరిసర ప్రాంతాలు, వరంగల్ చౌరస్తా ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్పస్వామి గుడిలోకి వరద పోటెత్తింది. హనుమకొండ-వరంగల్‌ రహదారి వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది. వరంగల్‌ అండర్‌ రైల్వే బ్రిడ్జి కింద వరద నిలిచింది. వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధమైంది. పంతిని వద్ద ఊర చెరువు ఉప్పొంగడంతో రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. కాడారిగూడె చెరువు కూడా రహదారిపై ప్రవహిస్తోంది. వరంగల్‌ నగరంలోని కాజీపేట రైల్వే స్టేషన్‌లోకి భారీగా నీరు చేరుకుంది. దాదాపు మోకాళ్ల లోతులో నీళ్లున్నాయి.

వరంగల్ నగరంలోని హనుమకొండ, కాజీపేట, వరంగల్ ట్రైసిటీలు వర్షపు నీటిలో తేలియాడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. కరీంనగర్ హనుమకొండ ప్రధాన రహదారిలోని నయీం నగర్ నాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ఐఎండీ అలెర్ట్ జారీ చేసినట్టుగానే భారీ వర్షాలు కురుస్తున్నాయి.





Tags:    

Similar News