దంచికొడుతున్న వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

Update: 2023-07-25 08:31 GMT

ఒకవైపు రుతుపవనాలు, మరోవైపు అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఉత్తర తెలంగాణలో వరద కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాల్లోని చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వరద నీటి కారణంగా పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పిడుగుపాటుకు పలు ఇల్లు ధ్వంసమయ్యాయి.

మహబూబాబాద్ జిల్లా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వట్టి వాగు బ్రిడ్జి పై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో కేసముద్రం – గూడూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాలేరు వాగు సైతం ఉధృతంగా ప్రవహిస్తుంది. దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం వద్ద లోయర్ బ్రిడ్జి నుంచి నీరు ప్రవహిస్తుండడంతో పెద్ద ముప్పారం -దంతాలపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

వరంగల్ జిల్లాలో భారీ వర్షాలతో ముంపు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరద నీరు చేరింది. వరద ఉధృతికి పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. వరంగల్-ఖమ్మం రహదారిపై వరద ప్రవాహం కారణంగా భారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరద ఎక్కువ కావడంతో పెద్దంపల్లి ఎస్సీ కాలనీతో పాటు పంగిడిపల్లి, ఆసిరెడ్డిపల్లి గ్రామాల్లోని ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది.


Tags:    

Similar News