భాగ్యనగరాన్ని వాన మళ్లీ ముంచెత్తింది. రెండు రోజులు కాస్త పొడిగా హాయిగా ఉందనుకున్న నగరవాసికి ఆదివారం స్పెషల్ గిప్ట్ అన్నట్టు ‘చుక్కలు’ చూపింది. ఆదివారం రాత్రి నగరంలో పలు ప్రాంతాల్లో కుడపోత వాన కురిసింది. బంజారాహిల్స్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, సూరారం, బహదూర్‌పల్లిలో వాన పడుతోంది. దీంతో వీధుల్లోకి మళ్లీ చేరి జనం ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల ఎప్పట్లాగే వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుని అలమటించారు.
ఆదివారం పడమటివైపు నుంచి రుతుపవనాలు వీయడంతో వాతావరణ చల్లబడింది. తెలంగాణలో వచ్చే మూడు రోజులు కూడా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో కుండపోత వానలు కూడా కురియొచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్ట్ 4 నుంచి రుతు పవనాలు బలహీన పడతాయని, 4 వారాలుగా పసిఫిక్ మహా సముద్రం ఉపరితలం వేడెక్కతోందని వాతావరణ నిపుణులు చెప్పారు.