ఉమ్మడి వరంగల్‌ వానల్లో ఆరుగురు బలి.. పదుల సంఖ్యలో గల్లంతు..

Update: 2023-07-27 17:34 GMT

వర్షాలు ప్రజల మీద పగబట్టినట్లు కురుస్తున్నారు. గురువారం కూడా రెండు తెలుగు రాష్ట్రాలు భీకర వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపోయాయి. వివిధ ప్రాంతాల్లో ఆరుగురు చనిపోగా పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, వాగులు దాటొద్దని అధికారులు చెబుతున్నా అత్యవసర పనులపై బయటికి రావడంతో విషాదాలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్, భూపాలపల్లి, మహబూబాద్, ములుగు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. భూపాలపల్లి జిల్లాలో మోరంచవాగులో సంజీవ్ అనే వ్యక్తి చనిపోగా నలుగురు గల్లంతయ్యారు. ములుగు జిల్లా మారేడుగొండ చెరువు కట్ట తెగడంతో పక్కనే ఉన్న ఇంట్లో ఒకరు చనిపోగా ముగ్గురు గల్లంతయ్యారు.

సమ్మక్క, సారలక్కలు కొలువై ఏటూరునాగారం గ్రామాల్లో వానలు బీభత్సం సృష్టించాయి. సమ్మక్క సారలమ్మల గద్దెల వద్దకు నీరు చేరింది. కొండాయి గ్రామం దగ్గర జంపన్న ఉప్పొంగడంతో ఎనిమిదిమంది గల్లంతయ్యారు. వేలేరు మండలం కన్నారం వాగును బైక్‌పై దాటుతూ మహేందర్ అనే వ్యక్తి నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు. మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి వాగులో శ్రీనివాస్, యాకయ్య అనే ఇద్దరు అన్నదములు చనిపోయారు. హనుమకొండలో ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతిచెందారు. పలు ప్రాంతాల్లో జనం గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. రాత్రి కావడంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలింది. కలెక్టర్లు, పోలీసు అధికారులు నిత్యం సహాయక కార్యక్రమాలను పర్యవేక్షrస్తున్నారు. వరదల్లో చిక్కకున్నవారిని హెలికాప్టర్ ద్వారా, పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

హైదరాబాద్ అబిడ్స్‌లో వర్షాల వల్ల రేకులు విరిగిపడడంతో ఓ యువకుడు చనిపోయాడు.వర్షం వస్తుండడంతో ఓ భవనం గోడ పక్కన నిల్చుని ఉన్న ఫరీద్ అనే యువకుడిపై నాలుగో అంతస్తులోని రేకులు పడిపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.


Tags:    

Similar News