High Tension At Gandhi Bhavan: విష్ణుకు దక్కని టికెట్.. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత..
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్ రాని నాయకుల్లో కొందరు పార్టీ మారేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ టికెట్పై ఆశపెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డికి నిరాశే ఎదురైంది. శుక్రవారం పార్టీ రిలీజ్ చేసిన అభ్యర్థుల జాబితాలో హైకమాండ్ జూబ్లీహిల్స్ టికెకెట్ ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కు ఇచ్చారు. ఈ క్రమంలో దోమలగూడలోని నివాసంలో విష్ణు తన అనుచరులతో సమావేశమయ్యారు.
భేటీ అనంతరం విష్ణు వర్గీయులు గాంధీ భవన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆందోళనకు దిగారు. గాంధీభవన్ లోపలికి వెళ్లకుండా ప్రధాన ద్వారానికి తాళం వేయడంతో.. ఇటుకలతో తాళం పగులగొట్టేందుకు ప్రయత్నించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. దీంతో గాంధీ భవన్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.