Hitension at Yellandu : ఇల్లందులో హైటెన్షన్.. మున్సిపల్ అవిశ్వాసంపై రగడ

Byline :  Krishna
Update: 2024-02-05 06:31 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాసంలో హైడ్రామా నెలకొంది. మున్సిపల్ చైర్మన్పై బీఆర్ఎస్ కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఇవాళ అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది. ఈ క్రమంలో తమను కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఓ సీపీఐ ఎమ్మెల్యే సహా ఇద్దరూ బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ నేతలు లాక్కెళ్ళేందుకు ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎంపీడీవో కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఆఫీస్ అద్దాలు ధ్వంసమయ్యాయి.

అవిశ్వాసంపై కౌన్సిల్ సమావేశం జరగకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అవిశ్వాసం సజావుగా జరిగేలా చూడాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందని.. అయినా పోలీసులు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వత్తాసు పలుకుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ విప్ జారీ చేశారు. కాగా మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అవిశ్వాసానికి బీఆర్ఎస్ సిద్ధమైంది.

Tags:    

Similar News