Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్‌ సెంటర్‌ .. ప్రారంభించిన హోంమంత్రి

Update: 2023-10-08 08:03 GMT

సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా గాంధీ ఆసుపత్రిలో అధునాతన సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గాంధీ ఆసుపత్రిలో తల్లీపిల్లల విభాగంలోని ఐదో అంతస్థులో ప్రత్యేకంగా ఈ సేవలను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఇకపై గాంధీ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండానే ఐవీఎఫ్​ పద్ధతిలో సంతానం పొందే అవకాశముంది. రూ.5 కోట్లతో అత్యాధునిక ఐవీఎఫ్​ చికిత్సలను అందుబాటులోకి తెచ్చినట్లు హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. ప్రైవేటులో రూ.లక్షల్లో ఖర్చయ్యే ఈ ప్రక్రియను గాంధీలో మాత్రం ఉచితంగా అందించనున్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ వైద్యరంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని అన్నారు. గాంధీ ఆస్పత్రిలో నే కాకుండా త్వరలో పేట్లబూర్జు, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రుల్లో కూడా ఐవీఎఫ్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వీటి ద్వారా ఖరీదైన ట్రీట్మెంట్‌ను ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌ ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు పాల్గొన్నారు.

2018 నుంచి గాంధీ దవాఖానలో ఐయూఐ విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని, మందులు వాడటంతో ఇప్పటివరకు 200 మహిళలకు సంతానం కలిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు చెప్పారు. ఉచితంగా రీకనలైజేషన్‌ శస్త్రచికిత్స చేసుకోవచ్చని ఆయన అన్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఐవీఎఫ్‌ విధానాన్ని అందుబాటులోకి తేవడం శుభపరిణామమని సంతాన సాఫల్య కేంద్రం నోడల్‌ అధికారి, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్‌ వెల్లంకి జానకీ తెలిపారు.

Tags:    

Similar News