Congress Mp Tickets : కాంగ్రెస్ ఎంపీ టికెట్లకు ఫుల్ డిమాండ్.. ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారంటే..?

Byline :  Krishna
Update: 2024-02-04 02:03 GMT

(Congress Mp Tickets) పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో 14స్థానాలు కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఎంపీ స్థానాలకు ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. 17 ఎంపీ స్థానాల కోసం 306 అప్లికేషన్స్ వచ్చాయి. పలువురు ప్రముఖులు, అధికారులు దరఖాస్తు చేసుకున్నవారిలో ఉండడం గమనార్హం.

శనివారం ఒక్కరోజే 166 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం, మల్కాజ్ గిరి, నల్గొండ, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వరంగల్, పెద్దపల్లి స్థానాలకు అధిక దరఖాస్తులు రాగా.. హైదరాబాద్​కు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి.

ఖమ్మం స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరీ, సీనియర్ నేత వీహెచ్, మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు దరఖాస్తులు సమర్పించారు. మల్లు నందిని ఖమ్మం నుంచి 500 కార్లతో ర్యాలీగా వచ్చి గాంధీ భవన్లో అప్లికేషన్ అందజేశారు. మల్కాజిగిరి పార్లమెంట్​ స్థానానికి బండ్ల గణేశ్, సర్వే సత్యనారాయణ, నాగర్​ కర్నూల్​ స్థానానికి సంపత్​ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు.

హెల్త్ డైరెక్టర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ఖమ్మంతో పాటు సికింద్రాబాద్​ స్థానాలకు అప్లై చేసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ కు సన్నిహితంగా మెలిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. అయితే ఆ టికెట్ ను గులాబీ బాస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకే కేటాయించడంతో శ్రీనివాస రావు అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు సడెన్ గా కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం అప్లై చేసుకుని అందరినీ షాక్ కు గురిచేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. 

భువనగిరి, నల్గొండ స్థానాలకు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. నల్గొండ స్థానానికి జానారెడ్డి కుమారుడు రఘువీర్​రెడ్డి, పటేల్​ రమేశ్​రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కూతురు శ్రీనిధిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి స్థానానికి కోమటిరెడ్డి అన్న కొడుకు సూర్య పవన్​ రెడ్డి, మరో బంధువు చల్లూరి మురళీధర్​ రెడ్డి, చామల కిరణ్​ కుమార్​రెడ్డి, తీన్మార్​ మల్లన్న, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​ రెడ్డి కూతురు కీర్తి రెడ్డి కూడా దరఖాస్తులు సమర్పించారు. పెద్దపల్లి స్థానానికి ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీ అప్లై చేసుకున్నారు.

కరీంనగర్​ పార్లమెంట్​ స్థానానికి వెలిచాల రాజేందర్​ రావు సహా పలువురు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబాబాద్ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్​ భట్టు రమేశ్​ దరఖాస్తు చేసుకున్నారు. నాగర్‌కర్నూల్ నుంచి మాజీ ఎంపీ మందా జగన్నాథం, నిజామాబాద్ స్థానానికి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఆదిలాబాద్ నుంచి ఐఆర్ఎస్ ఆఫీసర్ రాథోడ్ ప్రకాశ్,రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, అదనపు డీఎంహెచ్‌వో కుమురం బాలు, పరిశ్రమల శాఖ రిటైర్డ్‌ అధికారి రాంకిషన్‌ సహా పలువురు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎంతమందికి అవకాశం దక్కుతుందో చూడాలి.



Tags:    

Similar News