తెలంగాణాలో మద్యం టెండర్లకు భారీ పోటీ నెలకొంది. అధికసంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తు ఫీజు కింద రూ.2 లక్షలు వసూలు చేస్తున్నా ఎవరూ వెనుకడుగు వేయడంలేదు. ఎన్నికల సీజన్ కావడంతోనే పెద్ద మొత్తంలో వ్యాపారలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు
కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ లో మద్యం షాపుల టెండర్లకు చాలామంది పోటీపడుతున్నారు. గత నోటిఫికేషన్‌లో తిరిగి ఇవ్వని దరఖాస్తు ఫీజు కింద రూ.1,350 కోట్లు, దుకాణాల లైసెన్స్ ఫీజు కింద దాదాపు రూ.3,500 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం..ఈనెల 4 నుంచి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చివరి గడవుగా ప్రభుత్వం నిర్ణయించింది. 21న లాటరీ విధానంలో మద్యం షాపులు కేటాయించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సుదారుల ఎంపికకు సంబంధించి ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుండగా.. డిసెంబర్ నుంచి మద్యం దుకాణాల ఏర్పాటుకు కొత్త లైసెన్సులను లాటరీ ద్వారా మంజూరు చేయనున్నారు.