Traffic Challan Payment:పెండింగ్‌ చలాన్లతో 8.44 కోట్ల ఆదాయం.. సర్వర్ హ్యాంగ్

Byline :  Veerendra Prasad
Update: 2023-12-29 02:35 GMT

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ట్రాఫిక్‌ చలాన్ల(Traffic challans) చెల్లింపులకు రాయితీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల నుంచి భారీ స్పందన లభి స్తోంది. పెద్దఎత్తున జరిమానాలు పడిన వాహనదారులంతా పేరుకుపోయిన చలాన్లను చెల్లించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులు జరగ్గా, రూ. 8.44 కోట్ల ఆదాయం సమకూరినట్లు రవాణాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల చెల్లింపులకు గానూ రూ 2.62 కోట్ల ఆదాయం, సైబరాబాద్‌ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపులకు గానూ రూ. 1.80కోట్ల ఆదాయం వచ్చింది. ఇక రాచకొండ పరిధిలో 93వేల చలాన్ల చెల్లింపులకు రూ.76.79 లక్షల ఆదాయం వచ్చింది.

వాహనాదారులు పెండింగ్‌ చాలన్లను క్లియర్‌ చేసేందుకు ఈ- చలాన్‌ సైట్‌ను ఆశ్రయించడంతో సర్వర్ హ్యాంగ్ అవుతోంది. కాగా అధిక సంఖ్యలో చెల్లింపులు జరుగుతుండటంతో పలుమార్లు సర్వర్ మొరాయిస్తోందని సాంకేతిక బృందం సమస్యలు పరిష్కరిస్తుందని వెల్లడించారు. అయితే చలాన్లు కట్టినా కూడా ఇంకా సదరు నంబరు కలిగిన వాహనంపై అదే చలాన్లు కనిపిస్తే సమస్య తెలిపి లావాదేవీ జరిపిన ఐడి, వాహనం నంబర్, పేమెంట్ చేసిన తేదీ, పేమెంట్ మోడ్ వివరాలు హెల్ప్ డెస్క్‌కు పంపితే సమస్య పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాలను వసూలు చేసేందుకు తెలంగాణ పోలీస్​ శాఖ భారీగా రాయితీలు ప్రకటించింది. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం, ద్విచక్ర వాహనాల చలాన్లపై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం, లారీలు, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌, మీ సేవా కేంద్రాల్లో చలాన్లు చెల్లించే అవకాశాన్ని కల్పించింది.

Tags:    

Similar News