హైదరాబాద్ నడిబొడ్డులోని హుసేన్ సాగర్ చెరువు నిండుకుండలా మారింది. నీటిమట్టం పూర్తిస్థాయి మించికి దాటిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా శుక్రవారం 8 గంటలకు 513.61 మీటర్లుగా నమోందైంది. దీంతో దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేశారు. దిగువ ప్రాంతాలకు భారీగా నీటిని విడుదల చేస్తున్నామని నాలాల దగ్గరికి వెళ్లకూడదని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నగరమంతటా భారీగా కురిసిన వర్షాలకు హుసేన్ సాగర్‌తోపాటు నగరంలోని ఇతర పెద్ద చెరువులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కూడా నిండుకుండల్లా మారాయి.
మ్యాన్ హోల్స్ తెరిస్తే కేసులు
కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రమాదాల నివారణ కోసం జీహెచ్ఎంసీ అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకుంటోంది. సీవరేజీ ఓవర్‌ఫ్లో అయ్యే మ్యాన్ హోల్స్ గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని జలమండలి అధికారులు సిబ్బదిని ఆదేశించారు. ఎవరైనా మ్యాన్‌హోళ్ల మూతలు తెరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మ్యాన్‌హోల్ సమస్యలు ఎంటే జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో కొందరు స్థానికులు మ్యాన్ హోల్స్ తెరిచే ప్రయత్నం చేస్తున్నారు.