etela rajender : పోలీసులను అడ్డం పెట్టుకొని వారిపై కేసీఆర్ దాడులు : ఈటల

Update: 2023-08-19 13:37 GMT

పంద్రాగస్టు రోజున అర్థరాత్రి వేళ ఓ గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంఘటన హైదరాబాద్‎లో సంచలనంగా మారింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో గిరిజన విచారణ పేరిట మహిళను దారుణంగా కొట్టగా.. బాధితురాలి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై విపక్షాలు సహా ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని దళిత, గిరిజన మహిళలపై దాడులు చేయించడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

మహిళపై దాడి ఘటనలో కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి సరిపెట్టడం సరికాదని ఈటల అన్నారు. దళిత, గిరిజన మహిళలపై దాడులు చేస్తే కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ‘‘గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో మరియమ్మ అనే దళిత మహిళను లాకప్ లో చావగొట్టారు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసినా ఫలితం లేదు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన ఘటన, కరీంనగర్ జిల్లాలోనూ పోలీసు పెట్టిన హింస చూశాం. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు’’ అని అన్నారు.

గవర్నర్ సీరియస్..

ఈ సంఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ సీరియస్ అయ్యారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 48 గంటల్లో ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , డీజీపీ, రాచకొండ సీపీలను ఆదేశించారు. అదే విధంగా బాధిత మహిళకు అండగా ఉండాలని రెడ్‌క్రాస్‌ సొసైటీకి గవర్నర్ సూచించారు.


Tags:    

Similar News