ఎప్పటిలాగే.. దీపావళి తర్వాత కంటి ఆస్పత్రికి క్యూ కట్టిన పేషంట్లు

Update: 2023-11-13 02:57 GMT

దీపావళి పండుగ వేళ టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్త వహించాలని పలు స్వచ్ఛంధ సంస్థలు, సామాజిక కార్యకర్తలు, సంబంధిత అధికారులు.. ఎంత చెప్పినా వాటిని పెడచెవినే పెడుతుంటారు కొందరు. నిర్లక్ష్యంగా బాణాసంచా కాలుస్తూ గాయాల బారిన పడి ఆస్పత్రి పాలవుతుంటారు. ఎక్కడో చోట ప్రతీసారి ఇదే తంతు జరుగుతోంది. అయితే ఈసారి కూడా దీపావళి తర్వాతి రోజున హైదరాబాద్ నగరంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పేషంట్లు క్యూకట్టారు. సిటీలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 50 మంది కంటి సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు. వీరంతా దీపావళి పండుగ వేళ టపాసులు పేలుస్తూ గాయపడినవారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది పెద్దవారే కావడం గమనార్హం.

ఇక పండుగ రోజున మల్కాజ్‌గిరిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా ఇంట్లో దీపాలు ముట్టిస్తుండగా భార్య(79) చీరకు నిప్పు అంటుకుంది. నిప్పును ఆర్పేందుకు ప్రయత్నించిన భర్త(82) ... ఆమెను రక్షించే క్రమంలో మంటలు అంటుకొని చనిపోయాడు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ విజయ్ నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పండుగ వేళ ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మరోచోట టపాసులు కొనుక్కునేందుకు వెళ్లే క్రమంలో ఓ కుంటుంబం రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

పాతబస్తీ శాలిబండలోని ఓ ఎలక్ట్రానిక్‌ షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది. సౌత్ జోన్‌ డీసీపీ సాయి చైతన్య ఫైర్‌ సిబ్బందిని రప్పించి ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు యత్నిస్తూనే ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌కు మంటలు వ్యాపించకుండా చాకచక్యంగా వ్యవహరించారు. భారీ ప్రమాదాన్ని తప్పించారు. మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల పరిధిలోని కెమికల్‌ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతుండగా ముగ్గురు సిబ్బంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు అవసరమని, ముఖ్యంగా కంటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల పట్ల మరింత జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.

Tags:    

Similar News