Hyderabad Book fair : ఈ నెల 9 నుంచి హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్
హైదరాబాద్‌లోని ఎన్డీఆర్ స్టేడియంలో ఈ నెల 9 నుంచి బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. బుక్ ఫెయిర్ ప్రదర్శనపై సోమజి గూడ ప్రెస్ క్లబ్లో బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 9 నుండి 19 వరకు దాదాపు 10 రోజుల పాటు ఈ బుక్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో దాదాపు పది లక్షల కంటే ఎక్కువ మంది పుస్తక ప్రియులు పాల్గొంటారని అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ వెల్లడించారు. తెలంగాణ సాహిత్యాన్ని మరింత విస్తృతంగా పరచడమే లక్ష్యంగా సొసైటీ అధ్యక్షుడు గౌరీ శంకర్ తెలిపారు. ఇప్పటి తరం వారితోనూ పుస్తక పఠనం చేయించాలనే ఉద్దేశంతో పుస్తక మేళ నిర్వహించనున్నట్లు తెలిపారు.
గత బుక్ ఫెయిర్ ప్రదర్శనలను దృష్టిలో ఉంచుకొని వీక్షకులకు ఏ సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం బుక్ ఫెయిర్ ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధ నౌక పేరున ‘గద్దర్ ప్రాంగణం’ అని నామకరణం చేస్తున్నామని తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల కాలంగా గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కారు సహాయ సహకారాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయన్నారు. పుస్తక ప్రియులలో ఉత్సాహన్ని పెంపొందించే విధంగా దాదాపు 340 స్టాల్లను ఇప్పటికే ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. మరింత కవులు, రచయితలు తమ స్టాల్లు పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేయడాన్ని చూస్తుంటే ఈ సంవత్సరం పుస్తక ప్రదర్శన అద్బుతంగా ఉండబోతోందని ఆశిస్తున్నామని గౌరీ శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.