Hyderabad: వన్ సైడ్ లవ్.. ప్రేమ పేరుతో అధ్యాపకుడిని వేధించిన యువతి

Byline :  Veerendra Prasad
Update: 2024-02-23 05:11 GMT

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సుందరకాండ సినిమా చాలామంది టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. నైన్టీస్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్టే అయింది. సినిమా చూసి కొందరు.. మాస్టార్లపై మనసు పారేసుకున్నారు కూడా. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి చెందిన యువతి కూడా.. క్లాస్ రూమ్ లో లెక్చరర్ చెప్పే పాఠాలకు ఆకర్షితురాలైంది. అతని మీద మనసు పడింది. ఆ సినిమాలో హీరోయిన్ చెప్పినట్లుగానే.. తాను ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పింది. కానీ అతడు నో చెప్పడంతో అతని పరువు తీసేందుకు తెగించింది. హైదరాబాద్‌ నగర సీసీఎస్‌ పరిధిలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. నగరంలోని అశోక్‌నగర్ లో ఉన్న ఓ ట్రైనింగ్ సెంటర్‌ లో జాయిన్ అయిన ఓ యువతి.. అక్కడ పాఠాలు చెప్పే లెక్చరర్‌ని ప్రేమించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉన్న విషయాన్ని అతడి చెవిలో వేసింది. అయితే సదరు లెక్చరర్ మాత్రం.. తనకు ఇదివరకే పెళ్లైందని, భార్యాబిడ్డలున్నారని సున్నితంగా తిరస్కరించాడు. అయినా కూడా తన ప్రేమలో నిజాయితీ ఉందని, తనను అంగీకరించాలని చెప్పడంతో.. లాభం లేదనుకొని కాస్త గట్టిగానే మందలించాడు. దీంతో ఆయనపై పగ పెంచుకున్న యువతి... అతడి భార్య, కూతురు ఫొటోలు సేకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి అందులో అప్ లోడ్ చేసింది. ఫాలోవర్లు పెరిగే కొద్దీ .. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. ఆ ఛానెల్ లో ఆ లెక్చరర్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను మాత్రమే ఎడిట్ చేసి వీడియోలు పోస్ట్ చేసేది. ఆ ఉన్మాదమైన మత్తులో 11 ఏళ్ల లెక్చరర్ కుమార్తె ఫొటోలు మార్ఫింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేసింది.

ఆ లెక్చరర్ పనిచేసే ట్రైనింగ్ సెంటర్ సంబంధిత వాట్సప్‌ గ్రూపుల్లో.. అతడి గురించి అశ్లీలతతో కూడిన పదజాలంతో పోస్టులు పెట్టేది. పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తూ వచ్చింది. ఆమె టార్చర్ భరించలేక చివరకు అతడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు టీమ్ సాంకేతిక ఆధారాలతో నిందితురాలిని అనంతపురంలో గురువారం అరెస్టు చేసింది. నిందితురాలిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించాం’ అని హైదరాబాద్‌ నగర సీసీఎస్‌ జాయింట్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, డీసీపీ కవిత, ఏసీపీ చాంద్‌బాషాలు గురువారం కేసు వివరాలు వెల్లడించారు.

Tags:    

Similar News