తెలంగాణలో ఇప్పటికే టీఎస్పీఎస్‌సీ పేపర్ లీకేజీ ఘటన తీవ్ర సంచలనం రేపుతుండగా, తాజాగా ఐఐటీ జేఈఈ పరీక్షలోనూ మాస్ కాపీయింగ్ జరిగింది. కాపీయింగ్‌కి పాల్పడిన నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన అభ్యర్ధి వాట్సాప్ ద్వారా ఇతర పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాస్తున్న మరో నలుగురు విద్యార్ధులకు తాను రాసిన సమాధానాలు చేరవేశాడు.
ఆదివారంనాడు (జూన్ 4న) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైటెక్ సిటీలో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజ్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు.. ఎల్‌బీనగర్, మల్లాపూర్, మౌలాలి, సికింద్రాబాద్ కేంద్రాలలో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాశారు. పరీక్షకు సరిగ్గా సన్నద్ధం కాలేదో ఏమో.. కాపీయింగ్‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఆ నలుగురే సభ్యులుగా ఉన్నారు. ఆదివారం ఉదయం పరీక్షకు నలుగురూ.. చాకచక్యంగా తమ తమ స్మార్ట్ ఫోన్‌లతో పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించారు. నలుగురిలోనూ తెలివైన విద్యార్థి.. సికింద్రాబాద్ ప్యాట్నీలోని ఎస్‌వీఐటీ కాలేజ్‌లో పరీక్ష రాసి, మ్యాథ్స్, కెమిస్ట్రీ కి సంబంధించిన ఆన్సర్స్ స్క్రీన్ షాట్‌ను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు.
ఎల్‌బీనగర్, మల్లాపూర్, మౌలాలి కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న మిగతా ముగ్గురు విద్యార్థులూ ఆ సమాధానాలను కాపీ చేశారు. ఈ క్రమంలోనే.. ఒక కేంద్రంలో ఇన్విజిలేటర్ ఈ బాగోతాన్ని గమనించి ఆ విద్యార్థిని పట్టుకున్నారు. అతణ్ని ప్రశ్నించగా మొత్తం తతంగమంతా బయటపడింది. వెంటనే ఆ కేంద్రంవారు హైదరాబాద్ ఐఐటీ అధికారులకు సమాచారం అందించారు. వారు సికింద్రాబాద్ ఎస్‌వీఐఈ సెంటర్‌లో విధుల్లో ఉన్న అబ్జర్వేటర్‌కు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన అబ్జర్వేటర్ వెంటనే వెళ్లి తనిఖీ చేయగా చైతన్య అనే విద్యార్థి వద్ద స్మార్ట్ ఫోన్ లభించింది. దీంతో ఆ పరీక్షా కేంద్రం అధికారులు మార్కెట్ పోలీసులకు సమాచారం అందించి విద్యార్థిని అప్పగించారు. అతడిపై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి సమాచారంతో దిల్ సుఖ్ నగర్‌లో ఉన్న మిగతా విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా.. సికింద్రాబాద్ ఎస్‌వీఐటీ సెంటర్‌లో పట్టుబడిన ఆ తెలివైన విద్యార్థిది కడప జిల్లా. ఎస్‌ఎస్‌సీలో 600/600 మార్కులు, ఇంటర్‌లో 940/1000 మార్కులు సాధించాడు. ఇంత తెలివైన విద్యార్థి.. స్నేహితుల కోసం తన భవిష్యత్తును అంధకారం చేసుకున్నాడని అతడి బంధువు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.