
న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగే ప్రముఖ నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఈ క్రమంలో పోలీసులు వేడుకలకు పర్మిషన్ ఇచ్చినా.. పలు రూల్స్ పెట్టి కఠినంగా అమలు చేస్తారు. కాగా, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసుల టైంను పొడగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం (డిసెంబర్ 31) అర్ధరాత్రి 12:15 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 12.15 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరి.. ఒంటి గంటలకు గమ్యస్థానాలకు చేరతాయని చెప్పారు.
ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, సాధ్యమైనంత వరకు మెట్రో సేవలు వినియోగించుకోవాలని అన్నారు. సిబ్బంది, పోలీసుల నిఘా ప్రతీ రైలుపై ఉంటుందని చెప్పారు. మెట్రో స్టేషన్స్ లోకి తాగి వచ్చినా.. సిబ్బందితో దుర్భాషలాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెట్రో ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.