హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డ్ సృష్టించింది. మెట్రో రైలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణించారు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ప్రయాణికులను ఆకర్షించి హైదరాబాద్ మెట్రో చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 4.90 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో ఆ సంఖ్య 5లక్షలు దాటుతుందని అన్నారు.
మెట్రో రైలు ప్రయాణాన్ని యువత చాలా బాగా ఎంజాయ్ చేస్తోందని ఎన్‌వీఎస్ రెడ్డి చెప్పారు. మెట్రో రైలులో ప్రయాణించే వారిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారన్నారు. రోజుకు 6.70 లక్షలమంది ప్రయాణం చేసేందుకు అనుగుణంగా మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 1000 ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా వేశారు.
కాగా 2017 నవంబర్ 28న మెట్రో రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. మెట్రో ప్రాజెక్టు కారిడార్-4లో భాగంగా రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం జరుగుతోంది. దీనికి సీఎం కేసీఆర్ 2022 డిసెంబర్ 9న శంకుస్థాపన చేశారు. మొత్తం 6,250 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల పొడవున ఈ లైన్‌ను నిర్మిస్తారు. ఈ లైన్ పూర్తైతే కేవలం 30 నిమిషాల్లోనే ఎయిర్ పోర్టు నుంచి హైటెక్ సిటీ చేరుకోవచ్చు. మూడేళ్లలో దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.