ఓఆర్ఆర్‌పై వేగ పరిమితి పెంపు.. ఇక దూసుకెళ్లొచ్చు..

Update: 2023-06-28 04:13 GMT

హైదరాబాద్‌కు మణిహారం లాంటి ఔటర్ రింగు రోడ్డుపై వేగ పరిమితి పెరిగింది. ఓఆర్ఆర్‌పై ప్రస్తుతమున్న వేగ పరిమితిని గంటకు 100 కి.మీ నుంచి 120 కి.మీ.కి పెంచారు. తెలంగాణ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌ ట్విటర్లో ఈ విషయం వెల్లడించారు. పెంచిన పరిమితికి తగ్గట్టు అన్ని భద్రత నిబంధనలను అమలు చేయాలని హెచ్ఎండీఏను ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌కు రాకపోకలకు జీవనాడి లాంటి ఓఆర్ఆర్‌పై తరచూ ప్రమాదాలు జరుగుతుండంతో గతంలో వేగపరిమితిని గంటకు 120 కిలోమీటర్ల నుంచి 100 కి.మీ.కి తగ్గించారు. రెండు లేన్లలో కనిష్ట వేగం 80 కి.మీ, గరిష్టంగా 100 కి.మీ ఉండాలని నిర్ణయించారు. మూడు, నాలుగు లేన్లలో 40 కి.మీ దాటకూడదన్నారు. కారణమేమిటో చెప్పకున్నా ఇప్పుడు స్పీడ్ లిమిట్ పెంచారు. మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో ఓఆర్ఆర్ భద్రత ప్రొటోకాల్‌పై సమీక్ష నిర్వహించినట్లు అర్వింద్ కుమార్ తెలిపారు.

ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా ఓఆర్ఆర్పై వాహనాలు రాకెట్లలా దూసుకెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. స్పీడ్ లిమిట్‌ను మళ్లీ పెంచడంతో ప్రమాదు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంట్రీల్లో భద్రతా నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఓఆర్ఆర్‌పై రోజూ రెండు లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అంచనా. ఎక్కడో అక్కడ ప్రమాదాలూ జరుగుతూ ఉంటాయి. ఏడాదికి 300 నుంచి 350 వరకు ప్రమాదాలు జరుగుతున్నట్లు అంచనా.

Tags:    

Similar News