అవసరమైతేనే బయటకు రండి - మంత్రి తలసాని

Byline :  Veerendra Prasad
Update: 2023-09-05 07:36 GMT

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని(Hyderabad) లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులపై భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Minister Talasani Srinivas Yadav) ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, ట్రాన్స్ కో ఎండీ, ఈవీడీఎం డైరెక్టర్, హైదరాబాద్‌ కలెక్టర్‌తో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడ నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

చెట్లు, కొమ్మలు కూలిన చోట నుంచి వెంటనే తొలగించాలని సూచించారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్‌ నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్లు 040-21111111, 23225397లో సంప్రదించాలన్నారు.

నగర ప్రజలు వర్షాల వల్ల తలెత్తే సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ సూచించారు. ఈవీడీఎం కంట్రోల్‌ రూమ్‌ 9000113667కు ఫోన్‌ చేయాలన్నారు. వర్షాలు పడే సమయంలో సాధారణ ప్రజలు, విద్యుత్‌ వినియోగదారులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ రఘుమారెడ్డి కోరారు. విద్యుత్‌కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912, 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు 73820 72104, 73820 72106, 73820 71574కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. దీంతో పాటు సంస్థ మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌, సోషల్‌ మీడియా ద్వారా కూడా విద్యుత్‌ సంబంధిత సమస్యలను మా దృష్టికి తీసుకురావొచ్చు. 

Tags:    

Similar News