హైదరబాద్‌లోని నాచారం పీఎస్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. సనా అనే మహిళ తన భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక పేస్బుక్ లైవ్‌లో సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. విదేశాల్లో ఉంటున్న భర్త హేమంత్ గత 5 నెలలుగా సనను తన మాటలతో వేధిస్తున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తీవ్ర మనస్తాపానికి గురైన సన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన నాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాచారంలో ఉంటున్న సన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఐదేళ్ల క్రితం సన, హేమంత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. పెళ్లైన కొన్ని రోజులకే అత్తమామల వేధింపులు అధికమయ్యాయి. ఈ క్రమంలోనే హేమంత్ మరో అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు. దీంతో భర్త కూడా సనను వేధించడం మొదలు పెట్టాడు. విదేశాల్లో ఉంటూ కూడా హేమంత్ సనను మానసికంగా వేధించేవాడు. ఇది భరించలేక జీవితం మీద విరక్తితో ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో పెట్టి తన బాధను వివరించి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.