Homeguard Ravinder : చికిత్స పొందుతూ హోంగార్డ్ రవీందర్ కన్నుమూత
అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ కాసేపటి క్రితం కన్నుమూశారు. ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్.. పరిస్థితి విషమించి చనిపోయనట్లు డీఆర్‌డీవో అపోలో వైద్యులు ప్రకటించారు. నాలుగు రోజుల కిందట.. జీతాలు పడలేదనే ఆవేదనతో ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. తీవ్ర గాయాలైన ఆయన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించడంతో డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. హోంగార్డ్ రవీందర్ మృతిపై హోంగార్డ్ జేఏసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
కాగా, పాతబస్తీ రక్షకాపురానికి చెందిన రవీందర్.. 15 ఏండ్లుగా హోంగార్డుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు.అయితే ప్రభుత్వం హోంగార్డులను రెగ్యులరైజ్ చేయడం లేదని, జీతాలు చెల్లించడం లేదని రవీందర్ మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గోషామహల్ కమాండెంట్ ఆఫీసు కు వెళ్లి అడిగాడు. అక్కడి అధికారులు అవమానించడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు సమాచారం.