నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..గవర్నర్ తమిళిసై

Update: 2023-08-01 13:00 GMT

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమేదన వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కున్న ప్రజలను చూసి ఎంతో బాదేసిందన్నారు. త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అండగా నిలవాలన్నారు. రాష్ట్రంలో కురిసిన వర్షాలపై కొన్ని రాజకీయ పార్టీలు తనకు మెమొరాండం ఇచ్చాయని ప్రభుత్వాన్ని నివేదిక అడిగానని గవర్నర్ మీడియాతో చెప్పారు. నివేదిక రాగానే కేంద్రానికి పంపిస్తానని తెలిపారు.

ఇదే క్రమంలో రాష్ట్రంలో పెండింగ్‎లో ఉన్న బిల్లుల వ్యవహారంపైన గవర్నర్ స్పందించారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని గవర్నర్ చెప్పారు. బిల్లుల తిరస్కరణకు సంబంధించిన కారణాలను తెలియజేశారు. బిల్లులు తిప్పి పంపడం తన ఉద్దేశం కాదని గవర్నర్‌ క్లారిటీ ఇచ్చారు. " నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. బిల్లులు ఎందుకు తిప్పి పంపానో కారణాలు చెప్పాను. అసలు నా ఉద్దేశం అది కాదు. సర్కార్ కావాలనే నన్ను బద్నాం చేయాలని చూస్తోంది. నేను ఎలాంటి పొలిటికల్ యాక్టింగ్ చేయడం లేదు.నేను చెప్పిన కారణాలపై సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం’’ అంటూ గవర్నర్ మీడియాతో చెప్పారు.

తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారంపై గత కొంత కాలంగా గవర్నర్ తమిళిసై , రాష్ట్ర సర్కార్‎కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. కొన్ని బిల్లులను పాస్ చేయలేదని తెలంగాణ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం పంపించిన 10 బిల్లుల్లో , కేవలం మూడు బిల్లులకు మాత్రమే గవర్నర్ ఆమోదం తెలిపారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా.. మరో రెండు బిల్లులపై సర్కార్ వివరణను గవర్నర్ కోరారు. మిగిలిన మూడు బిల్లుల్లో ఒక బిల్లును వెనక్కి పంపారు. మరో రెండు బిల్లులపై అదనపు వివరణ కోసం ప్రభుత్వానికి పంపించారు. దీంతో గవర్నర్ తీరుపై సర్కార్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గవర్నర్ పెండింగ్ బిల్లులపై కీలక వ్యాఖ్యలు చేశారు.




Tags:    

Similar News