కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి.. నక్కకు నాగకలోకానికి ఉన్నంత తేడా ఉంది: సీఎం కేసీఆర్

Update: 2023-06-06 16:49 GMT

తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాలమూరు గడ్డది ప్రత్యేక స్థానమని సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్ కర్నూల్ లో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన కేసీఆర్.. బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడారు. పాలమూరు గడ్డ నుంచి చాలామంది నాయకులు అధికారం చేపట్టారని.. వాళ్ల వల్ల జరిగిన అభివృద్ధి మాత్రం ఏం లేదని మండిపడ్డారు. తెలంగాన రాకపోయుంటే నాగర్ కర్నూల్ జిల్లా కాకపోయుండేదని, ఇన్ని ఆఫీసులు వచ్చేవి కావని గుర్తు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డ కేసీఆర్.. ఈ వ్యాఖ్యలు చేశారు.

మంది మాటలు పట్టించుకోవద్దు:

ఇదే జిల్లా నుంచి వచ్చిన ఓ నాయకుడు ధరణిని బంగాళాఖాతంలో వేయాలన్నాడు. ధరణిని బంగాళాఖాతంలో వేయడమంటే రైతులను బంగాళాఖాతంలో వేయడమేనని కేసీఆర్ అన్నారు. ‘కొత్త వేషాలతో మోసగాళ్లు మళ్లీ బయల్దేరారు. రాష్ట్రంలో ధరణి రాకముందు అంతా లంచాలమయంగా ఉండేది. ధరణి తీసుకొచ్చి.. అధికారుల దగ్గరున్న అధికారాన్ని ప్రజలకు ఇచ్చాం. రెవెన్యూ రికార్డులు మార్చే అధికారం ఇప్పుడు సీఎంగా నాకు కూడా లేదు. ధరణి రావడం అంటే పైరవీలు, లంచాలకు అడ్డుకట్ట. ధరణి ఉండాలా? తీసెయ్యాలా? మీరే చెప్పాలి. మంది మాటలు పట్టించుకోవద్ద’ని కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ ధ్వజమెత్తారు.

ధరణి లేకపోతే ఎన్ని మర్డర్లు అయితుండే?:

‘ధరణితో 99శాతం భూముల సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఒకటి రెండు శాతం ఇబ్బందులు ఉండొచ్చు. కానీ, ఇవాళ ధరణి లేకపోతే భారీగా పెరిగిన భూముల రేట్లకు ఎన్ని పంచాయితీ అయితుండే? ఎన్ని పోలీస్ కేసులు అయితుండే? ఎన్ని మర్డర్లు అయితుండే? ఇప్పుడు అవన్నీ లేవు. పల్లెలు ప్రశాంతంగా ఉన్నయ్. ఆ ప్రశాంతతను దూరం చేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారు. వాళ్ల మాటలు నమ్మొద్దు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి.. ఇప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’ అని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్తించారు.

ఇక్కడి మాడల్ కావాలని దేశమంతా కోరుతోంది:

‘తెలంగాణ మోడల్ తమకు కావాలని దేశమంతా కోరుతోంది. దేశం రమ్మంటోంది పోవాలా? వద్దా? అని ఇదివరకే మిమ్మల్ని అడిగినా. పో బిడ్డ మేం ఆశీర్వదిస్తాం అని అన్నరు. నాకు వేరే బలగం, బంధువులు లేరు. మీరే నా బలగం, బంధువులు. మీరిచ్చిన ధైర్యంతోనే ముందుకు పోతున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే రైతు రాజ్యం. వాళ్లను గెలిపిస్తే.. మళ్లీ వీఆర్ఓలను పెడతాం. ప్రజల రక్తం తాగుతాం. దోచుకుంటామని కాంగ్రెస్ దుర్మార్గులు సిద్ధంగా ఉన్నారు. మోస పోతే గోస పడతాం. ఆలోచించండ’ని ప్రజలనుద్దేశించి మాట్లాడారు కేసీఆర్.


Tags:    

Similar News