రాగల 3 రోజుల్లో వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్

Update: 2023-09-21 04:59 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రమంతటా రాగల 3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం ఎల్లో అలెర్ట్ సైతం జారీ చేసింది.

అల్పపీడనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలోని పశ్చిమ్ బంగ, ఒడిసా తీరాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు.. సముద్ర మట్టం నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరుకు వ్యాపించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వాలి ఉందని .. ఇది రాగల 2 రోజులలో వాయువ్య దిశగా కదిలి ఝార్ఖండ్ మీదగా వెళ్లే అవకాశం ఉన్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోవు 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్​తో పాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఇక హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని.. సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

మరో తెలుగు రాష్ట్రం ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఏపీ మీదుగా పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయని.. ఫలితంగా వచ్చే రెండు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో అనేక చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.




Tags:    

Similar News