Breaking News.. హైదరాబాద్ సహ ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
గత రెండ్రోజులుగా తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. ఈరోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని స్కూళ్లకు ప్రభుత్వం ఈ రోజు సెలవు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్తగా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు (Collectors) తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అల్పపీడన ప్రభావంతో సోమవారం కూడా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ సోమవారం సెలవు ప్రకటించారు. భారీ వానలతో పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యధికంగా మోపాల్ మండలంలో 15.7 సెంటీమీటర్లు, ఇందల్వాయిలో 14.8, డిచ్‌పల్లి మండలం గన్నారంలో 14 సెంటీమీటర్ల వర్షం పడింది. 10 మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.