తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. వణుకుతున్న ప్రజలు

Byline :  Krishna
Update: 2023-12-24 03:23 GMT

తెలంగాణను చలి వణికిస్తోంది. రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం 8 అయితే గానీ ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఇక సాయంత్రమైతే ఇళ్ల తలుపులు మూసి ఇంట్లోనే ఉండే పరిస్థితి నెలకొంది. శనివారం రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు పడిపోయాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌, గిన్నెదరిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్‌ 8.8, తిర్యానీలో 8.9, బేలలో 9.2, బజార్‌ హత్నూర్‌లో 9.3, పొచ్చెరలో 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జంట నగరాల్లో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మరో రెండు, మూడురోజులు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. చలికి తోడుగా భారీ పొగ మంచు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Tags:    

Similar News