తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఇవాళ మరో సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్దే అధికారమని ఇండియాటుడే సర్వే తేల్చింది. కాంగ్రెస్ 63 - 73 స్థానాల్లో, బీఆర్ఎస్ 34 - 44, బీజేపీ 4 - 8 స్థానాల్లో, ఎంఐఎం 4 - 8 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని ఇండియా టుడే అంచనా వేసింది. గురువారం రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ వైపే మొగ్గుచూపాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ ను మించిన ఫలితాలు వస్తాయని చెబుతోంది. ఈ ఎన్నికల్లో తాము 70 స్థానాల్లో గెలుస్తామని ధీమాతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మూడో సాధి అధికారం చేపట్టబోతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను పలువురు నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారితో..పలు కీలక విషయాలు చర్చించినట్లు తెలిసింది. పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై సీఎంతో వారు చర్చించారు. కాంగ్రెస్ గెలుస్తుందన్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని కేసీఆర్ సూచించారు. రెండు రోజులు ప్రశాంతంగా ఉండాలన్న సీఎం.. ఆదివారం రోజు పెద్దఎత్తున సంబరాలు చేసుకుందామని వారితో చెప్పినట్లు తెలుస్తోంది.