నిరుపేదలకు మరో శుభవార్త అందించనున్న రేవంత్ సర్కార్
ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా రేవంత్ సర్కార్ మరో గ్యారెంటీ పై ఫోకస్ పెట్టింది. ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టడానికి ముహూర్తం ఖరారు చేసింది. శనివారం సంచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం పై కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇండ్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారో.. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్ల లబ్దిదారుల వివరాలు ముఖ్యమంత్రికి గృహ నిర్మాణ శాఖ అధికారులు అందజేశారు.
ఈ సమీక్ష అనంతరం.. ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని, అందుకు అనుగుణంగా వెంటనే విధివిధానాలను తయారు చేయాలని సీఎం సూచించారు. ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రితో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.