IPS Naveen Kumar : సీనియర్ ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్ట్

Byline :  Veerendra Prasad
Update: 2024-01-12 07:36 GMT

ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంటి కబ్జాకు యత్నించిన కేసులో ఐపీఎస్ నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్న నవీన్ కుమార్.. జూబ్లీహిల్స్ లోని మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై విచారించిన పోలీసులు.. శుక్రవారం ఆయన్ను అరెస్ట్ చేశారు. గతంలో నవీన్ కుమార్‌ను ఇదే కేసు విషయమై విచారించి నోటీసులిచ్చారు సీసీఎస్ పోలీసులు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నవీన్ కుమార్ అన్న, వదినలను అరెస్ట్ చేశారు కూడా. తాజాగా నవీన్ కుమార్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు.

గతంలో IAS అధికారిగా సుదీర్ఘ కాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన భన్వర్‌లాల్‌ 2017లో రిటైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన అందరికీ తెలుసు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన ఇంటిని 2014లో ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని అద్దెకిచ్చారు. దీని కాల పరిధి అయిదు సంవత్సరాలు. అయితే 2019లో ఈ ఒప్పందం ముగిసినా.. ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది భన్వర్‌ లాల్‌ ఆరోపణ. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి IPS అధికారి నవీన్‌కుమార్‌ దిగారు. అయితే, నకిలీ పత్రాలను సృష్టించి.. తాను అద్దెకు ఉంటోన్న ఇంటిని సొంతం చేసుకోడానికి నవీన్ కుమార్ ప్రయత్నించినట్టు పోలీసుల ఆరోపణ. నకీలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫోర్జరీ చేశారని, తమ ఇంటిని అక్రమంగా కబ్జా చేయాలని చూస్తున్నారని భన్వర్ లాల్ సతీమణి ఆరోపణలతో సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టి అరెస్ట్ చేశారు. 




Tags:    

Similar News