GovernorTamilisai vs KTR : తమిళిసై కూడా అన్‎ఫిట్ : మంత్రి కేటీఆర్

Byline :  Aruna
Update: 2023-09-26 10:48 GMT

బీజేపీ పదే పదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎందుకు అవమానిస్తోందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్రంపైన ఎందుకు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అమృతకాల సమావేశాలు అని చెప్పి రాష్ట్రంపై మోదీ విషం చిమ్మారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పార్లమెంట్‎లో తొలిరోజే మోదీ తెలంగాణపై విషం చిమ్మారని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్న తీరును ఆయన ప్రశ్నించారు. తమిళిసైను గవర్నర్‎గా నియమించడం సర్కారియా కమిషన్ నిబంధనలకు విరుద్ధం అని ఆయన అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఏం చేశారని మోదీ పాలమూరుకు వస్తున్నారు..? :

మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.."అమృత కాల సమావేశాలని చెప్పి ప్రధాని విషం చిమ్మారు. దేశ ప్రధాని మోదీ ఎందుకు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారు? తెలంగాణ పుట్టుకను ఎందుకు ప్రశ్నిస్తున్నారు?తెలంగాణను ఎందుకు పదే పదే అగౌరవపరుస్తున్నారు? కొత్త పార్లమెంట్‎లో మొదటి రోజే తెలంగాణపై విషం చిమ్మారు. విభజన హామీలకు పాతర వేశారు. ప్రధానమంత్రి తెలంగాణ ప్రజలకు తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాల్సిందే. రాష్ట్ర ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ ప్రజల శాపం తప్పనిసరిగా బీజేపీకి తగులుతుంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేకుండా పోతుంది. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల్లో ఒక్కదానికి కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదు. పాలమూరుకి ఏం చేశారని ప్రధాని వస్తున్నారు?.పాలమూరులో కాలుపెట్టే నైతిక హక్కు మోదీకి లేదు. పదేళ్ల నుంచి కృష్ణా జలాల్లో వాటా తేల్చడం లేదు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. ఓట్లు కావాలంటే ప్రధానికి మంచి పనులు చేసే సత్తా ఉండాలి. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ప్రజలు నమ్మరు.

తమిళిసై కూడా అన్‎ఫిట్ :

ఇద్దరిని ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేశాం. ప్రజా ఉద్యమాల్లో ఉన్న వారినే సిఫార్సు చేశాం. ఒకరు ప్రొఫెసర్, మంచి వ్యక్తి అని ఆమెదిస్తారని అనుకున్నాం. కానీ ఆయన్ని గవర్నర్ అన్‏ఫిట్ అన్నారు.రాజకీయాల్లో ఉన్నవారిని సిఫార్సు చేయొద్దని అన్నారు. సత్యనారాయణ ట్రేడ్ యూనియన్‎లో సేవలు చేశారు. గవర్నర్లు మోదీ ఎజెంట్లుగా పని చేస్తున్నారు. తమిళిసై గవర్నర్ కాకముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. గవర్నర్ అయ్యే ఒక్కరోజు ముందు కూడా ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమెను నియమించడం సర్కారియా కమిషన్ నిబంధనలకు విరుద్ధం. గవర్నర్ వ్యవస్థ దేశంలో అవసరమా? గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ. గవర్నర్ వ్యవస్థ తీసేస్తారా..ప్రధాని హోదాని వైస్రాయ్ చేస్తారా" అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. governor vs ktr




Tags:    

Similar News