పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి.. హైదరాబాద్కు చేరిన జనగాం పంచాయితి..

Update: 2023-08-16 15:20 GMT

జనగాం బీఆర్ఎస్ పంచాయతీ హైదరాబాద్కు చేరింది. జనగాం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన 46 మంది బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేకు తెలియకుండా టూరిజం ప్లాజాకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ను కలిసి ఈసారి ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వవద్దని వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం తెలిసి ముత్తిరెడ్డి హైదరాబాద్ కు చేరుకోవడంతో అక్కడ హై డ్రామా నెలకొంది.




 


హైదరాబాద్కు అంసతృప్త నేతలు

ముత్తిరెడ్డిపై అసంతృప్తితో ఉన్న జనగాం నేతలు ప్రగతి భవన్ కు కూతవేటు దూరంలోని టూరిజం ప్లాజాలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిశారు. సీఎం అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అయితే విషయం కాస్తా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దృష్టికి రావడంతో ఆయన హుటాహుటిన టూరిజం ప్లాజాకు చేరుకున్నారు. ఎవరు రమ్మంటే వచ్చారో చెప్పాలని సదరు నేతలను ఎమ్మెల్యే కోరారు. తనకు చెప్పకుండా ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో వారంతా హైకమాండ్ పిలుపు మేరకే వచ్చామని చెప్పగా.. ఓ జెడ్పీటీసీ మాత్రం పల్లాకు టికెట్ ఇవ్వాలని సీఎంను కోరేందుకు వచ్చామని చెప్పినట్లు తెలుస్తోంది.


 



టికెట్ కోసం ఐదుగురు

జనగాం నియోజకవర్గంలో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ లొల్లి నడుస్తోంది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి.. స్థానిక నేతలకు మధ్య విభేదాలు తలెత్తడంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే సహకరించమని పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. జనగాం టికెట్‌ను ఐదుగురు నేతలు ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం కుమారుడు కిరణ్ కుమార్ గౌడ్ టికెట్ కోసం చూస్తున్నారు.


 



సీఎంను కలిసిన ముత్తిరెడ్డి

ఇదిలా ఉంటే జనగాం నియోజకవర్గంలో తనపై కుట్రలు జరుగుతున్నాయనడానికి ఈ క్యాంపు రాజకీయాలే సాక్ష్యమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆరోపిస్తున్నారు. తనపై ఎవరెన్ని కుట్రలు చేసినా... సీఎం కేసీఆర్కు తన గురించి తెలుసన్నారు. తనపై చేస్తున్న కుట్రల్లో భాగంగానే .. తన కూతురిని ఉసిగొల్పుతున్నారంటూ మండిపడ్డారు. హరిత ప్లాజా మీటింగ్ విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందన్న ముత్తిరెడ్డి అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్ కు వెళ్లారు. జనగాం నియోజకవర్గం టికెట్ పై జరుగుతున్న తాజా పరిణామాలను ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.




Tags:    

Similar News