తెలంగాణ ఇచ్చిన ధైర్యంతోనే ఆంధ్రా గూండాలతో తలపడుతున్నా... పవన్ కల్యాణ్

By :  Lenin
Update: 2023-11-22 12:12 GMT

‘‘ఆంధ్రప్రదేశ్ నాకు జన్మినిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చింది. ప్రజల కోసం నేను చేస్తున్న పోరాటానికి తెలంగాణ యువత అండగా నిలబడుతోంది. నేను పార్టీని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తే’’ అని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన బుధవారం హన్మకొండలో జరిగిన బీజేపీ ‘సకల జనుల విజయ సంకల్ప సభ’ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీతో కలసి ఎన్నికల్లో పోరాడతామని, బీజేపీ అభ్యర్థులు రావు పద్మ, ప్రదీప్ రావును గెలిపించాలని కోరారు. బలిదానాల తెలంగాణ ఈరోజు అవినీతిమయమైందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ‘‘బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి జరుగుతుందని నేను అసలు ఊహించలేకపోయాను,. ఇక్కడ కమీషన్ల రాజ్యం నడుస్తోంది. తెలంగాణ బిడ్డలు ఎలాంటి మార్పు రావాలని ఆత్మహత్యలు చేసుకున్నారో అలాంటి మార్పును తీసుకొద్దాం’’ అని పిలుపునిచ్చారు. మన దగ్గర ధనబలం, కండబలం లేకపోయినా గుండెబలంతో పోరాడొచ్చని పోరాటాల గడ్డ వరంగల్ తనకు నేర్పిందన్నారు.

తెలంగాణ ఉద్యమాల స్ఫూర్తితోనే తాను ఈ రోజు ఏపీ రౌడీలతో, ఫ్యాక్షనిస్టులతో తలపడుతున్నానని చెప్పారు. ‘‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోనే ఎన్నో సవాళ్లను తట్టుకుని నిలబడ్డాను. ఏపీలో తిరుగుతున్నట్టే ఇకపై తెలంగాణలోనూ తిరుగుతాను. ఆంధ్రాలో గుండాల పాలన సాగుతోంది. నేను అన్నిటికీ తెగించి పోరాడుతున్నాను’’ అని పవన్ అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ‘‘దళిత ముఖ్యమంత్రిని ఎలాగూ చూడలేకపోయాం. కనీసం బీసీ ముఖ్యమంత్రిని అయినా చూద్దాం’’ అని అన్నారు. 

Tags:    

Similar News