జనగామ టికెట్ నాదే, కేసీఆర్ ఆశీర్వాదాలున్నయ్.. ముత్తిరెడ్డి
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టికెట్ల పంచాయతీ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా కొంతమంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్ గల్లంతవుతుందని లీకులు రావడంతో ఎత్తులకు పైఎత్తులు సాగుతున్నాయి. ప్రత్యర్థులను దెబ్బకొట్టి అవకాశాలు మెరుగుపరచుకోవడానికి ఆశావహులు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామ టికెట్ కోసం ప్రయత్నిద్దామంటూ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి చేసిన ఫోన్ కాల్ కలకలం రేపుతోంది. ‘మనందరం ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా, రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా సీఎంను కలవాలి’ అని ఆయన నర్మెట జడ్పీటీసీ శ్రీనివాస్ నాయక్‌తో అన్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రంగంలో దిగారు. ఎవరెన్ని ప్రయత్నాలూ చేసినా ఈసారి కూడా టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేశారు.
ముత్తిరెడ్డి బుధవారం బచ్చన్నపేట గ్రామంలో మీడియాతో మాట్లాడారు.‘‘ఏవేవో చెబుతుంటారు. రాజేశ్వర్ రెడ్డి మంగళవారం రాత్రి తనే నాతో మాట్లాడారు. పార్టీ నియమావళిని అనుసరించి నాకే ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. మీరు సీనియర్ సభ్యులు, మీకు ఇబ్బంది ఉండదని పల్లా అన్నారు. కొంతమంది దురుద్దేశంతో నాపై బురద చల్లుతున్నారు. ఎవరేం చేసుకున్నా కేసీఆర్ గారి ఆశీస్సులు నాకే ఉంటాయి’’ అని ముత్తరెడ్డి చెప్పారు. ముత్తిరెడ్డి అలా చెబుతున్నా పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీలక నేతలకు ఫోన్లు చేసి మద్దతు కోరుతున్నట్లు చెబుతారు. కాగా తాను శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడిన మాట వాస్తవమేనని పాగాల సంపత్ అంగీకరించారు.