మెట్రో ప్రాజెక్ట్ చరిత్రలో పెద్ద తప్పు.. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు
హైదరాబాద్‌లో మెట్రో రైలును విస్తరించేందుకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 60 వేల కోట్లతో మెట్రో విస్తరిస్తామని సోమవారం (జులై 31) సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో వ్యవస్థను భారీగా విస్తరించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టు విస్తరించేందుకు ఆమోదం వచ్చింది. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్ట్ పై మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్ట్ మరో కాళేశ్వరం కాబోతుందని ఆయన అన్నారు. ట్రాఫిక్ లేని ఓఆర్ఆర్ రూట్లో మెట్రో నిర్మించడాన్ని వ్యతిరేకించారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో నిర్మించడానికి బదులు.. ప్రజల కోసం బస్సులు వేస్తే సునాయాసంగా వెళ్లొచ్చని సూచించారు. ఈ మెట్రో ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేస్తుందని తెలిపారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రోకు బదులు బస్ సర్వీస్ కల్పిస్తే ప్రజలకు మేలు జరగడమే కాకుండా.. నిధులు మిగులుతాయని అన్నారు. బస్సు సర్వీస్ కల్పిస్తే.. 100 బస్సు అవసరమవుతాయని, వాటికి మహా అయితే సుమారు రూ. 100 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. అదే మెట్రో వేస్తే.. ఒక కిలోమీటర్కే రూ.200 నుండి రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.
రాష్ట్రానికి ఇప్పుడున్న అప్పులే తీరలేదంటే.. మరో కొత్త అప్పు పుట్టుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నరకంగా ఉన్న ప్రాంతాల్లో మెట్రో మార్గాల్ని విస్తరించి, ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. అవసరమైన చోట BRTS (Bus Rapid Transit System) నిర్మాణం చేపట్టాలన్నారు. అన్ని రూట్లను అనుసంధానించి.. సరైన పార్కింగ్ సదుపాయం కల్పిస్తే సొంత వాహనదారులు కూడా ప్రజా రవాణా వినియోగిస్తారని అన్నారు.