తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలది ఒకే కథ. అన్ని పార్టీలు డబ్బుతో ఓట్లను కొనాలని చూస్తున్నాయి. పథకాలు, హామీలతో ప్రజలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి పడితే వాళ్లకు కాకుండా, ఏవరి ఓటేస్తే ఏంటి అనుకోకుండా తమ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని లోక్ సత్తా పార్టీ చీఫ్ జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఆయన విజ్ఞప్తి చేశారు. కోపం, కసితో ఓటు వేయొద్దని, ఆలోచనతో మన భవిష్యత్తు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
‘అన్ని పార్టీలూ డబ్బుతో ఓట్లు కొంటున్నాయి, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నాయి, అధికారాన్ని కేంద్రీకరించాయి, అవినీతికి పాల్పడుతున్నాయి.. ఎవరికి ఓటు వేసినా ఒకటే అని కోపంతో, కసితో ఓటు వేయకండి. కాస్త నింపాదిగా ఆలోచించి ఒక్క మౌలికమైన తేడాని గుర్తించండి. ఏ పార్టీ ఆర్థిక ప్రగతికి, మౌలిక వసతులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకి దోహదం చేస్తుంది, ఏ పార్టీ డబ్బంతా కేవలం తాత్కాలిక తాయిలాలు, ప్రభుత్వోద్యోగుల పాత పెన్షన్ విధానం (OPS) వంటి వాటికి పంచేసి రేపొద్దున ఏమీలేకుండా భవిష్యత్తుని నాశనం చేస్తుంది.. ఆలోచించి ఆర్థికాభివృద్ధి, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఓటు వేయండి. ముఖ్యంగా యువతకి విజ్ఞప్తి. 30 న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయండి, మీ భవిష్యత్తుని కాపాడే ఆర్థిక ప్రగతికి దోహదం చేసే పార్టీకి ఓటు వేయండి’ అంటూ జయప్రకాశ్ నారాయణ జాతినుద్దేశించి మాట్లాడారు.