కవి జయరాజ్కు కాళోజీ అవార్డు..

Byline :  Krishna
Update: 2023-09-06 13:18 GMT

ప్రముఖ కవి, రచయిత, గాయకుడు జయరాజ్కు కాళోజీ అవార్డు దక్కింది. ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే ‘‘కాళోజీ నారాయణ రావు అవార్డు’’ 2023 ఏడాదికి గాను ఆయన ఎంపికయ్యారు. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు సీఎం కేసీఆర్ జయరాజ్ను ఎంపిక చేశారు.

మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షత లేని సమ సమాజం కోసం తన సాహిత్యాన్ని సృజించారు. బుధ్దుని బోధనలకు ప్రభావితమై అంబేద్కర్ రచనలతో స్పూర్తి పొందారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లె పల్లెకు తిరుగుతూ.. తన ఆట పాట ద్వారా ప్రజల్లో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించారు.

ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రచించారు. మనిషికీ ప్రకృతికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు. ఈ మేరకు వారు ముద్రించిన పలు పుస్తకాలు ప్రజాదరణ పొందాయి. ఇక ఈ నెల 9న కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో కవి జయరాజ్కు కాళోజీ అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డుతో పాటు రూ. 1,01,116 నగదు, జ్జాపికను అందించి సత్కరించనున్నారు.

Full View

Full View

Tags:    

Similar News