కర్నాటక స్కీంలనే తెలంగాణలో అమలు చేస్తామంటున్నారు - కుమారస్వామి
కాంగ్రెస్ పార్టీపై జేడీఎస్ నేత, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు ఎవరూ నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో జనాన్ని మభ్యపెడుతోందని కుమారస్వామి ఆరోపించారు. కర్నాటకలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని కేవలం ఓట్ల కోసమే కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ కర్నాటక పథకాలనే తెలంగాణలోనూ అమలు చేస్తామంటున్నారని కుమారస్వామి స్పష్టం చేశారు. కర్నాటకలో మాట నిలబెట్టుకోలేని వారు తెలంగాణలో అవే హామీలు ఇవ్వడం విచిత్రంగా ఉందని అన్నారు. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీలు విఫలమయ్యాయన్నఆయన.. రూ.లక్ష వరకు రుణాలు రద్దు చేస్తామని చెయ్యలేదని మండిపడ్డారు. సాగుకు 5 గంటల కరెంట్ కూడా ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. కర్నాటకలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గృహజ్యోతి, యువనిధి పథకాలు అమలు కావడం లేదన్న కుమారస్వామి.. తెలంగాణలో రైతుబంధు విజయవంతంగా అమలవుతోందని ప్రశంసించారు.